14, ఏప్రిల్ 2011, గురువారం

ఏకాంతం - ఒక అనుభూతి

మనుషులు ఏకాంతంలో వుండే విలువ గురించి దాదాపు మరిచిపోయారనే చెప్పవచ్చు. తెల్లవారితే చాలు హడావిడి మొదలవుతుంది. డైలీ రొటీన్‌, రోజంతా టెన్షన్‌, సాయంత్రంవేళ కాస్త సమయం దొరికితే టీవికి కళ్ళప్పగించడం... ఏకాంతంలోని మాధుర్యాన్ని మనం మర్చిపోయామనిపిస్తోందీమధ్య ఎక్కువగా. టి.విలు, సినిమాలు (సి.డిలు అనాలేమో), ఎక్కడకు వెళ్ళినా ఒంటరిగా ఉండం...చుట్టూ జనాలు.. అలసిపోయి వచ్చి ఇల్లు చేరుతాం. ఏదో తిన్నామనిపించి... తెల్లవారి లేస్తే మళ్లీ ఇదే కార్యక్రమం...
కాని ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాలి... మహా మహా ఆవిష్కరణలు, గొప్ప వస్తువుల, విషయాల ఆవిర్భావం ఏకాంతంలోనే పుట్టాయి. గుంపులో కాదు. మానవ జీవిత చరిత్ర పరిశీలిస్తే... సత్యాన్ని, సౌందర్యాన్ని, శివతత్త్వాన్ని ఏకాంతంలోనే కనుక్కొన్నారు. ఎన్నో మహత్కార్యాలు ఏకాంతంలో సంభవించాయి. ఉత్తమమైన చిత్రంగాని, శిల్పంగాని, కవితగాని, మహాకావ్యంగాని గుంపులో, గందరగోళంలో సృష్టించబడలేదు.
ఏకాంతంగా ఉండటం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అలా అని ఇరవై నాలుగ్గంటలూ గడియ పెట్టుకుని, గదిలో కూర్చోమని అనడం లేదు. జీవితం గడపడానికి పనిచేయాలి, ఇతరులతో గడపాలి, కానీ పూర్తిగా మనకోసం మనం కాస్తంత సమయమైనా కేటాయించుకోవాలి. అటువంటి ఏకాంతంలోనే .... మనమేమిటో, మనకేం కావాలో, మనం ఏమార్గంలో వెళుతున్నామో...అది సరైనదా, కాదా అని విశ్లేషించుకోగలిగితే....అనేక విషయాలు మనకు అనుభవమవుతాయి. మనల్ని ఉన్నత శిఖరాలకి తీసుకుపోగల ఆలోచన ఇలాంటి ఏకాంతంలో నుండే పుడుతుంది. ఆత్మచైతన్యం కలుగుతుంది. ప్రేరణ, శక్తి కలుగుతుంది. కొత్త ఉత్సాహం ఉరకలు వేయిస్తుంది.
ఏకాంతాన్ని మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి. ఎప్పుడో ఒకప్పుడు కొన్ని నిముషాలు మనకోసం మనం కేటాయించుకోలేమా?
ఒంటరిగా ఉన్నప్పుడే - ''మనలో ఉన్న తప్పులు, వ్యతిరేకభావాలు, అసూయ, ద్వేషాలు...'' అన్నిటినీ తరచి చూసుకోగలిగే అవకాశం వస్తుంది. మన పొరపాట్లు స్పష్టంగా తెలిసినపుడే...సరిదిద్దుకోవటం సులభతరమవుతుంది. మనలో ఏదైనా గొప్పతనం కనిపిస్తే దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనలు వస్తాయి. ఈ ఏకాంతమే మన ఆత్మపరిశీలనకు, ఆత్మ ప్రక్షాళనకు గొప్ప ఆయుధం, అవకాశం. దీన్ని ఎవరూ జారవిడుచుకోకూడదు. అది జీవితంలో గొప్ప మహత్వపూర్ణమైన సమయం అవుతుంది.
మన జీవితాలను, జీవనవిధానాలను సంతోషమయం చేసుకోవడానికి ఏకాంతం ఎంతో సహాయం చేస్తుంది. మీరు కూడా ఆ అనుభూతిని పొందండి... ఎన్నో విజయాలను సాధించండి!

3 కామెంట్‌లు: